ఓడను జరిపే ముచ్చట గనరే వనితలార నేడు ||పల్లవి||
ఆడువారు యమున కాడ కృష్ణుని గూడి
ఆడుచు బాడుచు నందరు జూడగ ||అను పల్లవి||
కొందరు హరి కీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసి యాడ ||చరణం 1||
కొందరు తడవడ పాలిండ్లు కదల
కొందరు బంగారు వల్వలు సడల
కొందరి కుటిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల||చరణం 2||
కొందరు త్యాగరాజ సఖుడే యనగ
కొందరి కస్తూరి బొట్టు కరుగగ
కొందరి కొప్పుల విరులెల్ల జారగ
కొందరి కంకణములు ఘల్లనగ ||చరణం 3||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి