ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ||పల్లవి||
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన యా కొనచూపులు
నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదు కదా ||చరణం 1 ||
పడతికి చనుగవ మెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవి కాలపు వెన్నెల కాదు కదా ||చరణం 2 ||
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కౌగిట యధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ||చరణం 3 ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి